అచట నిలిచిన హనుమ వీరుడు
అంత తిరుగుతు అన్ని చూచుచు
సీత జాడకై మరల వెదుకుతు
అశోకవనమున సంచరించెను 1
మంచి గంధములు విరజిమ్ముతు
పుప్పొడి నిండిన పువ్వులు గల్గిన
వింత మెరుగుల వెలిగి పోయెడి
శంతనక తీగెలు సంతాన చెట్లు 2
నందన వనమును సరిపోలు విధముగ
అన్ని హంగులతొ అలరారెడి పథములు
పక్షుల కిలకిలా నిండిన చెట్టులు
కోకిల కూతలు మధుర గీతములు 3
బంగరు వన్నెల లిల్లీలతో
కలువలు నిండిన కొలనులతో
తివాచీలు పరచిన భవనములతో
జల జల పారెడి సెలయేళ్ళతొ 4
విరగ కాసిన కాయల భారము
ఓర్వక క్రిందకి వంగిన కొమ్మలతొ
గుబురు పొదల మాటున దోబూచులాడుతు
గాలికి ఊగెడి వివిధ రంగుల ద్వజములతొ 5
అన్ని కాలముల పూసెడి లతలతొ
మదుర రసములు ఒలికెడి పండ్లతొ
శిరోభూషణము వలెనగుపడు
విరగ బూసిన చెట్ల కొమ్మలతొ 6
మెండుగ పూసిన పువ్వుల బరువుకి
క్రిందకి వంగిన కరణిక వృక్షములతొ
ఆకులకు తావీయనన్ని పూలతొ
అతి సుందరముగానగుపడు కింశుకములతొ 7
బహు శోభాయ మానముగా నుండి
చూపరులకు సేద తీర్చునటుల
అతి ఆహ్లాదకరమగు ఆ ప్రదేశమున
హనుమ అచ్చెరువందుచు తిరుగు చుండెను 8
కళ్ళు చెదిరెడి దీప కాంతిలొ
విరగ బూసిన పున్నాగ చెట్లు
సప్తపర్న చెంపక ఉద్దాలకాలు
ఆ శోభనింకను పెంచుచుండెను 9
వేలకొలదిగ అశోక చెట్లతొ
నీల అంజన మణుల కాంతులు
విరజిమ్మునట్టుగ అగుపడుతు
వనమనతయు రంగులు నింపుచుండెను 10
నందన వనమును మించునట్టుగ
కుబేర వనమగు చైత్రరధమును మించి
కనివిని ఎరుగని వింత హంగులతొ
ఎక్కడ చూడని అద్భుత సొగసుతొ 11
చుక్కలు నిండిన గగన వీధిని
మైమరపించెడి పూల గుత్తులతొ
ఆకస మంతయు చుక్కల మారుగ
పువ్వులు జల్లిన కొత్త నింగి వలె 12
వేలకొలదిగ మణులను పొదిగి
అన్ని రుతువుల పువ్వులు జల్లిన
మరో సముద్రమన్న భ్రాంతిని
ఇచ్చుచు వెలుగుచున్నదా అశోక వనము 13
తేనె పట్టులుగల పెద్ద కొమ్మలతొ
వివిధ రకముల పక్షి కూతలతొ
సుగంధమబ్బిన పిల్ల గాలులతొ
మనసుకూరట నిచ్చుచుండెనా వనము 14
సుగంధ మొసగెడి చెట్లతొ నిండి
మరో గంధ మాదన పర్వతమువలెను
పగడము పొదిగిన మెట్లను గల్గి
మరో కైలాస పర్వతము వలెను 15
మేలిమి బంగారు మిద్దెలు గలిగి
ఆకాశపుటంచులు తాకెడి ఎత్తులు గలిగి
ఎత్తగు గుట్టపై ఠీవిగ నిలబడి
చూపరుల దృస్ఠిని ఆకట్టుకుంటు 16
తాను నిల్చిన తావుకు ప్రక్కగ
అశోక వనపు సోభను పెంచుతు
వేయి స్తంభముల బలమున నిల్చిన
గుడినొక దానిని మారుతి చూసెను 17
మలిన వస్త్రమును కట్టుకున్నది
రాక్షస స్త్రీలు చుట్టి వున్నది
ఉపవాసించిన తనువుతొనున్నది
అతి ఉదాసీనముగనగుపించుచున్నది 18
వేడి నిట్టూర్పులు వదులు చున్నది
పున్నమి కళతొ వెలుగు చున్నది
ఒదిగి ప్రక్కగ కూర్చుని వున్నది
అలసిన కన్నుల చూచు చున్నది 19
నివురు గప్పిన నిప్పుల వున్నది
మలిన మంటిన మణివలెనున్నది
మబ్బుల మాటున రవి వలెనున్నది
పొగలు మూసిన మంటలా వున్నది 20
నలిగిన పచ్చని వలువగట్టినది
భూషణమేమియు లేకనున్నది
బురదలో మొలిచిన కలువ మొక్కవలె
పుష్పము లూడిన పూల దండవలె 21
దుఃఖ సాగరమున మునిగి వున్నదై
దీనావస్థలొ కృంగు చున్నదై
దుశ్ట గ్రహముల పాలిన బడినదై
కాంతిని వీడిన రోహిణి తార వలె 22
కంటి నిండుగ నీటిని గలిగి
బలమును వీడిన దేహము గలిగి
బాధన కృంగిన మనసును గలిగి
దుఃఖ స్థితిలో బానిస లాగా 23
ఆప్తులు హితులు దూరము కాగా
రాక్షస మూకలు చేరువ రాగా
నక్కల గుంపుల మధ్యన చిక్కిన
లేడి పిల్లవలె భయపడి చూచుచు 24
వానాకాలపు వానలతోటి కొమ్మలు వూడి
బోసిగ నిల్చిన వృక్షము లాగా
మాసిన జుట్టుతొ సర్పము లాగా
నడుము దాటెడి జడతో నున్నది 25
లాలన కరువై, తిండిని వదిలి
శోకము పెరిగి, నిడ్రాలేమితొ
కష్ఠము నెప్పుడు ఎరుగనిదై
బలవంతముగ జీవించుచున్నదై 26
విశాలనేత్రముల ఒప్పుచున్నది
మలినావస్థలొ కూర్చునున్నది
మంచిగ తర్కము చేసిన హనుమకు
ఆమేసీతని మనమున తోచెను 27
కోరిన రూపము దాల్చే శక్తితొ,
కపట మాయతో రావణుడు తెచ్చిన
సీతా మాత అదియే వేషము
భూషణములతో వెలుగుతున్నది 28
నిండు పున్నమి మోము గలది
చక్కటి కను బొమ్మలు గలది
కుంభములవంటి స్తనములు గలది
కాంతులుజిమ్మే దేహ చాయ గలది 29
బింబము వంటి అధరము గలది
సన్నటి చిన్న నడుమును గలది
కలువ కన్నులు నిడివగు జడనుగలది
రతీ దేవి వలె కళతోనున్నది 30
ఆరబోసిన పున్నమి వెన్నెలవలె
పవిత్రమగు తపమును సలిపెడి తపస్వివలె
కరుణను చూపుల నింపుకున్నదై
కటిక నేలపై కూర్చుని వున్నది 31
బాధను నిండిన హృదయముతో
మాటి మాటికీ నిట్టూర్పులు వదులుతు
అక్కడ వున్న సుందర దేవిని
ఈమెయె సీతని హనుమ తలచుచు నిలచెను 32
చెదిరిన కలవలె
రాలిన ఆశవలె
గెలుపుకు అడ్డంకివలె
కలుషిత మదివలె 33
కూలిన కీర్తివలె
మలినమైన కళవలె
రావణుడిచ్చిన బాధకు సీత
అగుపడె హనుమకు ఆ వనమందున 34
నీరు నిండిన జింక కన్నుల వంటి నేత్రములతొ
రంగు వీడిన ఇంద్ర ధనువు వంటి కనుబొమలతొ
నవ్వును వీడిన చంద్ర బింబము వంటి ముఖముతొ
నిరాశ చెంది నిట్టూర్పులు విడిచుచు 35
దీనావస్థలొ అటునిటు చూచుచు
విగత మనముతో విరిగిన ఆశతొ
కటిక నేలపై కూర్చుని వున్న
సీతా మాతను హనుమ చూసెను 36
దుమ్మును ధూళియు వొంటికి అంటగ
ఆభరణములేవియు తనువుపై లేక
నల్లని మబ్బుల మాటున దాగిన
చంద్ర బింబమువలె ఆమె వున్నది 37
తన్ను కనుగొన గోర కోర్కె గల
విద్య, చదువరి కొరకై వేచి నట్లు
అశోకవనమున సీతను చూసిన హనుమకు
పరి పరి విధముల తలపులు గల్గెను 38
సంస్కరణ లేని సాహిత్యము వలె
ఆభరణ హీనగు సీతను
మలిన భూషితగు మాతను
చూసిన హనుమ కలత చెందెను 39
అకళంకిత, కమల దళ నేత్రి
జనక నందన, శ్రీరాముని సతి
ఆమె సీతయని మనమున తలచుచు
పరిపరి విధముల హనుమాలోచించెను 40
కంఠాభరణములు చేతి కంకణములు
కర్ణాభూషనములు కాలి ఆందెలను
చాల కాలము వాటిని ధరించగ
మేనిపై ఏర్పడిన ఒత్తిడి చాయలను 41
రాముడు చెప్పిన అంగ వివరణలను
సరిపోల్చుచు సీతను పరిశీలించెను
"శ్రీ రాముడు చెప్పిన ఆభరణములివియే
జీర్ణము కాగ మిగిలినవివియె 42
రావణుడామెను అపహరించుచుండగా
క్రిందకు విసరగా మిగిలినవివియే
వానర మూకలగు దొరికిన వాటికి
సరిబోలు విలువగు ఆభరణమివియే 43
బంగరు వన్నెగల చెంగు మూటలో
క్రిందకు విసిరిన విస్తువులివియే
వానర మూకకు చెట్టుపై దొరికిన
మూటకు వాడిన చీరయునిదియే 44
మూటలొ విసరగా నేలను చేరి
కోతిమూకలకు అడవిన దొరికిన
అతి సుందరముగా శబ్దము చేసెడి
పరమ పవిత్రమగు మువ్వల జోడీలవిగో 45
మలిన పూరితమై చినుగులు పడిన,
నలిగి శోభలు పూర్తిగ పోయినా
రంగు ఒకింతగ మాసిపోయినా,
ఆమె కట్టిన ఆ పవిత్ర వస్త్రమదిగో 46
నివురు గప్పిన నిప్పువలె వున్నది
మబ్బు తునకల మాటున దాగిన
నిండు పున్నమి జాబిలి వలెనున్నది
రామ ధ్యానమున మునిగి వున్నది 47
బంగరు మేని చాయను గల్గి
పతివ్రతలలో మణివలె నున్నది
రాముని విడిచి ఒంటరిగ నున్నను
అతనిని గుండెలో నింపుకున్నది 48
రాముడీమెకై పరితపించెను
సీతను చూడక రోదన చేసెను
ఆమెకు దూరమై దుఃఖము చెందెను
ఆమె తోడుకై విలవిల లాడెను 49
తనసతి ప్రేమకు బాగుగ వగచెను
విరహము తాళక కన్నీరొదిలెను
రావణు చంపగ ప్రతినను పూనెను
అడవుల తిరుగుతు దీనత నొందెను 50
ఈమె అంగ సౌస్థవము
వాటి అమరిక, కదిలెడి పద్ధతి,
రాచ పుట్టుకన అగుపడు దర్పము
అన్నియు రాముని సరిబోలుచున్నవి 51
ఈమె తప్పక రాముని సతియే
అందుకే రాముని మనమున నింపినది
రాముని కొరకే ఈమె పుట్టినది
ఒకరిని వీడి వేరొకరుండలేరు 52
సీతను వీడియు బ్రతికి వుండుటయు
దుఃఖము చెందియు నిలచి వుండుటయు
ఆమెను వెదకగ అడవులు తిరుగుటయు
రాముడు చేసిన మహత్కార్యమే" 53
అనుచు మనమున తలచిన మారుతి
ఆమెయే సీతని రూఢి చేసుకుని
మనమునే రాముని సన్నిఢి చేరుకుని
పరి పరి విధముల కీర్తన చేసెను 54
Monday, April 23, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment